ఆ హోదా ఎన్టీఆర్ తోనే ఆఖరా? పార్ట్- 2

తమిళనాడులో ఎమ్జీఆర్ సక్సెస్ అయ్యారంటే …ఆయనది పొలిటికల్ గా బ్యాంగ్రౌండ్ ఉన్న కుటుంబం. ఇక జయలలిత కూడా ఎంజీఆర్ అండతోనే ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. కానీ ఎన్టీఆర్ అలా కాదు….స్వతహాగా నిర్ణయం తీసుకున్నారు-సింగిల్ గా బరిలోదిగారు-తెరవేల్పు గా వెలిగిన వ్యక్తి ప్రజాజీవితంలో అడుగుపెట్టి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. అన్నింటినీ తట్టుకుని నిలబడి తెలుగువారి ఖ్యాతిని చాటిచెప్పారు. కానీ ఆయన తర్వాత ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన దిగ్గజాలంతా పార్టీలు పెట్టి ప్రజాజీవితంలోకి వచ్చారు…కానీ…ఇప్పటి వరకూ ఎవ్వరూ సక్సెస్ కాలేకపోయారు. అలాంటి వారిగురించి చెప్పుకుంటూ పోతే చాలా లిస్టుంది.

కానీ తమిళనాడులో రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్ కాంత్, ప్రకాశ్ రాజ్…. ఏపీలో చిరంజీవి, పవన్ కళ్యాణ్… ముఖ్యంగా వీరే….మొదటగా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటే..మెగా ఫ్యామిలీ గురించే చెప్పుకోవాలి. ఎందుకంటే నందమూరి వారసుడిగా బాలకృష్ణ రాజకీయాల్లో కొనసాగుతున్నప్పటికీ ఆయన పార్టీన నడపడం లేదు…కేవలం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కానీ మెగా కుటుంబం లెక్క అలా కాదు. ఇండస్ట్రీ మొత్తం నాలుగు కుటుంబాల చుట్టూ తిరుగుతుందని చెబుతారు. మెగా,నందమూరి, అక్కినేని, దగ్గుపాటి. అయితే సినిమాల్లో అయినా, రాజకీయాల్లో అయినా పోటీ మాత్రం నందమూరి-మెగా కుటుంబాల మధ్యే. ఎన్టీఆర్ తో ఎవ్వరూ సరిసాటి లేరు కానీ…. ఇండస్ట్రీ-రాజకీయాల్లోనూ బాలయ్య-చిరు మధ్యే పోటీ సాగింది. అయితే బాలయ్య తండ్రి స్థాపించిన పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగుతుంటే…చిరంజీవి మాత్రం పార్టీ ప్రారంభించారు.

మూడు దశాబ్దాలకు పైగా తెలుగు సినిమా పరిశ్రమలో మగ మహారాజుగా వెలుగొందిన మెగాస్టార్ చిరంజీవి, సామాజిక న్యాయం పేరుతో ప్రజల్లోకి వచ్చి తిరుపతి వేదికగా ప్రజారాజ్యం పార్టీని 2008 ఆగష్టు 26న స్థాపించి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కానీ ప్రజలలోకి తన పార్టీని తీసుకెళ్లడంలో దారుణంగా విఫలమైయ్యారు. 2009లో జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ కేవలం 18 సీట్లతో సరిపెట్టుకోవలసి వచ్చింది. దీంతో సీఎం కుర్చీ ఎక్కాలన్న చిరు ఆశలు అడి ఆశలయ్యాయి. నిర్మాణ, నిర్వహణ లోపాలతో కుదేలైన పార్టీని ఇక తాను చేసేదేమిలేక మూడేళ్ల కూడా పూర్తి కాకుండానే 2011 ఆగష్టులో తన ప్రజా రాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసారు. తరువాత కాంగ్రెస్ నుంచి రాజ్యసభ సభ్యుడయ్యారు. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ యూపీఏ-2 క్యాబినెట్లో స్వతంత్య్రంగా పర్యాటకశాఖ మంత్రి అయ్యారు. మంత్రిగా కొనసాగినా.. తన శాఖలో ఎలాంటి ప్రత్యేకత చూపించలేకపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడం.. ఆపై ఏపీ ఎన్నికల్లో ప్రచార కమిటీ బాధ్యతలు భుజాన ఎత్తుకున్న పార్టీకి 2014 ఎన్నికల్లో ఒక్క సీటు సాధించ పెట్టలేకపోయారు. ఆ తర్వాత పార్టీకి క్రమం క్రమంగా దూరమవుతూ.. రాజకీయాలకు స్వస్తి చెప్పి..తనకు అచ్చొచ్చిన సినిమాలవైపు అడుగులు వేసారు.

ఇక అన్నయ్య చిరంజీవి బాటలోనే పయనించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మార్చి 14, 2014న జనసేన పార్టీని స్థాపిస్తున్నట్టుగా ప్రకటించారు. జనసేన ఆవిర్భావ సభలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జనసేన పార్టీని స్థాపిస్తున్నాన్నారు. ఆపై చేసిన ప్రసంగంలో ఆయన తన రాజకీయ చైతన్యం గురించి, తనపై వచ్చిన విమర్శలకు సమాధానాలు చెప్పారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ చేసిన విభజన తీరుపై ఆవేదన వ్యక్తం చేసాడు. అంతేకాదు పార్టీ విధి విధానాలు వంటివి స్పష్టంగా వ్యక్తపరిచారు. 2014లో ఎన్నికల్లోజనసేన పోటీ చేయకుండా బీజేపీ, టీడీపీ కూటమికి మద్దుతు ప్రకటించారు. ఆ ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ప్రత్యేక హోదా విషయమై..బీజేపీ, టీడీపీకి దూరం జరిగారు. ఆ తరువాత 24 అక్టోబరు 2017 న హైదరాబాద్ లో పార్టీ ప్రధాన కార్యాలయం స్థాపించి , 2019 ఎన్నికలే లక్ష్యంగా దూకుడు పెంచారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కానీ ఏపీ ఎన్నికల్లో జగన్ ప్రభంజనం ప్రత్యర్ధుల్ని తలెత్తుకోనీయకుండా చేసింది. ముఖ్యంగా పార్టీ స్థాపించినా.. దాన్ని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడంలో పవన్ కళ్యాణ్ విఫలమయ్యారు. ఈ ఎన్నికల్లో జనసేనానిగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్.. పోటీ చేసిన గాజువాక, భీమవరం రెండు చోట్ల ఓడిపోయారు. కేవలం ఓకే ఒక్క స్థానాన్ని సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టబోతుంది. ఇక తమ్ముడికి తోడుగా నరసాపురం ఎంపీ అభ్యర్ధిగా జనసేన పార్టీ తరపున పోటీ చేసిన నాగబాబు ఘోరంగా ఓడిపోయారు.

అటు తమిళనాడులో చూసుకుంటే రజనీకాంత్ ,కమల్ హాసన్ రాజకీయాలపై ఇంచుమించు ఒకేసారి ప్రకటనలు చేశారు. కమల్ 50 ఏళ్లలో సాధించిన విజయాలే ఆయన టాలెంట్‌కి నిదర్శనం. ఆయన 1960లో తొలిసారిగా బాల నటుడిగా సినిమాలో నటించారు. అప్పటి నుంచి చాలా భారతీయ భాషల్లో 200 పైగా సినిమాల్లో నటించారు. అనేక ప్రతిష్ఠాత్మక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. భరతనాట్యం, కర్ణాటక సంగీతంలోనూ మంచి నైపుణ్యం ఉంది. తను నటించిన చిత్రాలకు కూడా ఆయన పాటలు పాడారు. ఆయన కవి, రచయిత, నిర్మాత, దర్శకుడు కూడా. తరచూ వివాదాలు ఎదుర్కొనే కమల్….రాజకీయాల్లో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో అవినీతిని అంతం చేయడానికి, ప్రజా జీవనంలో మతతత్వాన్ని అడ్డుకోవడానికి తాను రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యేందుకు కృషి చేస్తానని కమల్ గతంలో ప్రకటించారు. 2016 డిసెంబర్‌లో ముఖ్యమంత్రి జయలలిత మృతి చెందడంతో తమిళనాట తీవ్ర రాజకీయ అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ఇది కీలక పరిణామం. కానీ కమల్‌ హాసన్‌ స్థాపించిన మక్కల్‌ నీది మయ్యం పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసింది.

పార్టీని స్థాపించిన 14 నెలల్లో పోరాడి ఈ స్థాయికి వెళ్లగలగటం బలాన్నిచ్చిందని చెప్పిన కమల్…ఫ్యూచర్లో పోరాడుతాం అన్నారు. ఫిబ్రవరి 21, 2018లో మక్కల్ నీది మయ్యమ్ పార్టీని కమల్‌ స్థాపించారు. దక్షిణాదిలో ఆరు రాష్ట్రాలకు గుర్తుగా ఆరు చేతులతో పార్టీ జెండాను తయారుచేసారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో తమిళనాడులో దాదాపు అన్ని స్థానాల్లో తన పార్టీ తరుపున అభ్యర్థులను నిలబెట్టారు. ఎన్నికల సంఘం కమల్ పార్టీకి టార్చిలైట్ గుర్తును కేటాయించింది.

ఇక రజనీకాంత్ ఇప్పటికీ ప్రత్యక్ష ఎన్నికల్లో దిగలేదు. అదిగో ఇదిగో అనడం మినహా ముందడుగు వేయాలంటే రజనీ భయపడుతున్నారా అనిపిస్తోంది. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేస్తారనుకుంటే ..చవరి నిముషంలో ఉసూరుమనిపించారు. మొన్న లోక్ సభ ఎన్నికల్లోనూ బరిలో దిగలేదు. పైగా అభిమానులు నిరాశచెందవద్దని…. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగుదామని చెప్పుకొచ్చారు. పార్టీ పెట్టి ఏళ్లు గడుస్తున్నా…ఇంకా ఏ విషయంలోనూ క్లార్టీగా ఉన్నట్టు లేరు రజనీకాంత్. అంటే భయమో-మరో కారణమో..రజనీ సక్సెస్ అయ్యే నమ్మకం పెద్దగా లేదు. ఇక విజయ్ కాంత్ ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు…డీఎండీకే పార్టీ స్థాపించిన తర్వాత ఓ దశలో దాదాపు 40 సీట్లు గెలిచి….కింగ్ మేకర్ అయ్యారు. తర్వాతి ఎన్నికల్లో విజయ్ కాంత్ కింగ్ అవుతారని అప్పట్లో బావించారంతా. కానీ జోరు తగ్గిందే కానీ పెరగలేదు. ఫ్యూచర్లో పెరిగే ఛాన్స్ లేదు. ఇంకా చెప్పుకుంటూ పోతే…సిల్వర్ స్క్రీన్ నుంచి రియల్ కాన్వాస్ పైకి అదృష్టం పరీక్షించుకునేందుకు వచ్చిన వారెందరో. కానీ ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయిలో నిలదొక్కుకున్న వ్యక్తి ఒక్కరూ లేరు. ఉండాలని…ఫ్యూచర్లో ఉంటారని కోరుకుందామన్నా….ఇప్పుడున్న వారిలో ఆస్థాయి ఎవ్వరికీ లేదని రీసెంట్ ఎన్నికలు తేల్చిచెప్పేశాయ్…మరి ఇంటస్ట్రీ నుంచి రాజకీయాల్లో వెలిగిన వ్యక్తిగా ఎన్టీఆర్ ఆఖరవుతారా?……

Leave a Reply

error: Content is protected !!