ఆ హోదా ఎన్టీఆర్ తోనే ఆఖరా? పార్ట్- 1

గ్లామర్ ఫీల్డ్ నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే అప్పటి వరకూ తెరవేల్పులుగా వెలిగి…రాజకీయాల్లో కూడా అదే ట్రెండ్ కొనసాగించడం మాటలు కాదు. పైగా ఏ చిన్న తేడా వచ్చినా ఇటు ఇండస్ట్రీ, అటు రాజకీయాల్లోనూ అప్పటి వరకూ ఉన్న పేరు ప్రఖ్యాతులు కోల్పోతాం. అయితే సినిమా వాళ్లు రాజకీయాల్లోకి రావడం అనేది ఎప్పటినుంచో ఉంది. ఇలా వచ్చిన సక్సెస్ అయిన వారి సంఖ్యా బాగానే ఉంది. ఎంజీఆర్, జయలలిత, ఎన్టీఆర్…ఇలా ఏ స్థాయిలో అంటే కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి అన్నంతగా రాజకీయాల్లో దూసుకుపోయారు. మనం చెప్పుకునేందంటే…ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆ రేంజ్ లో సక్సెస్ అయిన వ్యక్తి ఎన్టీఆర్ తర్వాత కనిపించలేదా? అంతటి హోదా…విశ్వనటుడితోనే ఆఖరా? ఎన్టీఆర్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన నటులంతా అట్టర్ ఫ్లాప్ అయ్యారా? అంటే ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం చెప్పాలి.

నందమూరి తారక రామారావు….సినీ,రాజకీయ రంగాల్లో ఓ సంచలనం. ఆయన స్థాపించిన పార్టీ మరో సంచలనం. పాలనా సంస్కరణ ల్లోనూ సంచలనం. పువ్వు పుట్టగానే పరిమళించినట్టు పార్టీ ఏర్పాటు చేసిన కొద్ది నెలల్లోనే అధికారాన్ని అందిపుచ్చుకుని తనదైన శైలితో పాలన రథాన్ని నడిపించిన అనితర సాధ్యుడు ఎన్టీఆర్. మూడున్నర దశాబ్దాల క్రితం మొగ్గతొడుక్కున్న పార్టీ జాతీయ స్థాయిలోనే ప్రత్యేకతను చాటుకుంది. ఆయన లేకున్నా ఆయన ఆదర్శాలు అలాగే ఉన్నాయి. అసలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఓ సంచలనం. నవరస నటనా సార్వభౌముడిగా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయి స్థానాన్ని పదిలం చేసుకున్న నందమూరి తారక రామారావు రాజకీయ అరంగేట్రం సమాచారం ప్రజల్లో సరికొత్త ఉత్సాహానికి కారణమైన సందర్భం. ఏకపక్ష పార్టీ విధానాలతో విసిగి వేసారిపోయి ఉన్న తెలుగు ప్రజలు ఎన్టీఆర్‌ రాజకీయ రంగ ప్రవేశానికి సాదర స్వాగతం పలకడమేకాదు కొద్దిరోజుల్లోనే అనితర సాధ్యమైన విజయాన్ని కట్టబెట్టి రాష్ట్ర పరిపాలనా బాధ్యతలు అప్పగించారు.

టీడీపీ ఆవిర్భావం, ప్రస్థానాన్ని పరిశీలిస్తే….1981 అక్టోబర్‌లో సర్దార్‌ పాపారాయుడు సినిమా షూటింగ్‌ జరుగుతోంది. తన షష్టిపూర్తి సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా నెలలో కనీసం 15 రోజుల పాటు ప్రజాసేవ చేయాలనుకుంటున్నట్టు ఎన్టీరామారావు ప్రకటించారు. 1982 మార్చి 28న ఎన్టీఆర్‌ అధికారికంగా 13 మంది సభ్యులతో పొలిటికల్‌ స్టీరింగ్‌ కమిటీని ప్రకటించారు. 1982 మార్చి 29 మధ్యాహ్నం 2.30 గంటలకు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తున్నట్టు ప్రకటించారు. 1982 ఏప్రిల్‌ 11న హైదరాబాద్‌ నిజాం కళాశాల మైదానంలో తొలిసారి పబ్లిక్‌ మీటింగ్‌ను నిర్వహించారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారి 80 వేల మందికిపైగా ఆ సమావేశానికి హాజరయ్యారు. 982 మే 28న తిరుపతిలో తొలిసారి తెలుగుదేశం సభ జరిగింది. లక్షలాది మంది ఆ సమావేశంలో పాల్గొన్నారు. 1983 జనవరి 3 ఎన్నికల సందర్భంగా ఎన్టీఆర్‌ తొమ్మిది నెలలు ప్రచారం చేసి, చివరగా తిరుపతిలో ఎన్నికల ప్రచారాన్ని ముగించారు. 1983 జనవరి 5న తెలుగుదేశం పార్టీ తొలిసారి ఎన్నికల బరిలో నిలిచింది. మొత్తం 294 స్థానాలకుగానూ 203 స్థానాలను దక్కించుకుని విజయపతాకాన్ని ఎగురవేసింది. ఆ ఎన్నికల్లో కాంగ్రె్‌సకు 60, ఇతరులకు 30 సీట్లు దక్కాయి. ఆంధ్రప్రదేశ్‌లో తొలి కాంగ్రేసేతర ముఖ్యమంత్రిగా ఎన్టీరామారావు చరిత్ర సృష్టించారు.

1984 జూన్‌ 9న హెల్త్‌చెకప్‌ కోసం ఎన్టీఆర్‌ అమెరికా పయనమయ్యారు.1984 ఆగస్టు 14న బైపాస్‌ సర్జరీ చేయించుకుని రాష్ర్టానికి చేరుకున్నారు. ఆ సమయంలోనే ఎన్టీఆర్‌పై మంత్రి నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు చేశారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలను చీల్చారు. ఎన్టీఆర్‌ సర్కార్‌ను నాటి గవర్నర్‌ రామ్‌లాల్‌ రద్దు చేశారు. ఆగస్టు 16న నాదెండ్ల భాస్కరరావుతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. 1984 సెప్టెంబర్‌లో పదవీచ్యుతుడైన ఎన్టీఆర్‌కు మద్దతుగా జనం ఆందోళనకు దిగారు. రాష్ట్రం అట్టుడికిపోయింది. జాతీయ స్థాయిలో ఎన్టీఆర్‌కు ప్రతిపక్షాల మద్దతు లభించింది. ప్రజాగ్రహాన్ని గుర్తించిన నాటి ఇందిర ప్రభుత్వం గవర్నర్‌ రామ్‌లాల్‌ను రీకాల్‌ చేసింది. ఆ స్థానంలో శంకర్‌దయాళ్‌ శర్మను నియమించింది. అసెంబ్లీలో బల నిరూపణకు ముందే నాదెండ్ల గద్దె దిగారు. 1984 సెప్టెంబర్‌ 20న ఎన్టీఆర్‌ అసెంబ్లీలో తన మెజారిటీని నిలబెట్టుకుని రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత అసెంబ్లీని రద్దు చేయాల్సిందిగా కోరుతూ గవర్నర్‌ శంకర్‌ దయాల్‌శర్మకు ఎన్టీఆర్‌ లేఖ రాశారు. ఎన్నికల గోదాలోకి దిగారు. ఇందిర హత్య తాలూకు సానుభూతి పవనాలను తట్టుకుని 202 అసెంబ్లీ స్థానాలను, 35 పార్లమెంట్‌ స్థానాలను కైవసం చేసుకోగలిగారు. పార్లమెంటులో ప్రతిపక్ష హోదా తెలుగుదేశానికి దక్కింది. 1985 మార్చి 9న ముచ్చటగా మూడోసారి ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతర కాలంలో జాతీయ స్థాయిలో కాంగ్రెసేతర పార్టీలను కూడగట్టి నేషనల్‌ ఫ్రంట్‌ను ఏర్పాటుచేసి ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ చేతిలో తెలుగుదేశం ఓటమి పాలైంది. రెండు స్థానాల్లో పోటీ చేసిన ఎన్టీఆర్‌ రెండవ నియోజకవర్గమైన కల్వకుర్తిలో చిత్తరంజన్‌దాస్‌ చేతిలో ఓటమి పాలయ్యారు.

1993 సెప్టెంబర్‌ 11న లక్ష్మీపార్వతితో ఎన్టీఆర్‌ వివాహం. అప్పటివరకూ వయోభారం, అనారోగ్య కారణాలతో ఇంటికే పరిమితమైన ఎన్టీఆర్‌ క్రియాశీలమయ్యారు. కాంగ్రెస్‌ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలను జనంలోకి తీసుకువెళ్లడం మొదలెట్టారు. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో మునుపెన్నడూ లేనివిధంగా 213 స్థానాలను దక్కించుకుని తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో కేవలం 26 సీట్లు దక్కించుకున్న కాంగ్రెస్‌ ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. 1995 ఆగస్టు తెలుగుదేశం పార్టీలో సంక్షోభం. చంద్రబాబు నాయకత్వంలో ఎన్టీఆర్‌ను వ్యతిరేకించి మెజారిటీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు. అధికారికంగా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు అధ్యక్షుడయ్యారు. 1995 సెప్టెంబర్‌ 1న ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలను స్వీకరించారు. 1996 జనవరి 18న ఎన్టీఆర్‌ టీడీపీ పేరుతో ప్రజాజీవితంలోకి తిరిగి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న రామారావు అనారోగ్యంతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆ ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ విజయఢంకా మోగించింది.

అయితే ఎన్టీఆర్ హయాంలోనూ….ఆయనో సినిమా హీరో…వస్తున్న జనం అంతా ఆయన్ను చూసేందుకే కానీ ఓటేసేందుకు కాదనే అభిప్రాయాలు వెల్లువెత్తాయ్. ఓ దశలో కేంద్రం భయపడి ముందస్తు ఎన్నికలు కూడా నిర్వహించింది. అయినప్పటికీ ఎన్టీఆర్ ప్రభంజనం ముందు తలొంచక తప్పలేదు. అయితే ఆయన తర్వాత ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లో అడుగుపెట్టిన వారంతా ఎందుకు సక్సెస్ కాలేకపోయారు? సినిమాల నుంచి రాజకీయాల్లో అడుగుపెట్టి ఇంతటి ప్రభంజనం సృష్టించిన వారిలో ఎన్టీఆర్ ఆఖరా? ఎందుకిలా జరిగింది….సెకెండ్ పార్ట్ లో చదవండి….

Leave a Reply

error: Content is protected !!